రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్. ఆయన చెప్పినట్లుగా చేయాల్సిందే. ఎవరైనా నోరు మెదపాలనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. పార్టీ ధిక్కరణను సహించేది లేదు.. ఇదీ టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి అందిన సందేశం. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు పేరుతో కొంత మంది చేస్తున్న రచ్చపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్లతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలను ఢిల్లీకి తీసుకెళ్తానని బయలుదేరిన వీహెచ్‌కు కునీసం గుమ్మం దగ్గరకు కూడా ఎంట్రీకి అవకాశం ఇవ్వలేదు.
అదే సమయంలో పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండన్న సమాధానం ఏఐసీసీ ఆఫీసు నుంచి రావడంతో సీనియర్లు ఖంగుతున్నారు. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి కంటే తాము దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్నామని తాము ఫిర్యాదులు చేస్తే నమ్ముతారని.. కనీసం రేవంత్ రెడ్డికి తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనలు అయినా ఇస్తారని ఆశ పడ్డారు. కానీ అలాటిదేమీ జరగకపోగా.. తమను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ జాబితాలో చేర్చేసి.. లైట్ తీసుకోవడంతో సీనియర్లు ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోసారి నోరెత్తితే ఏం జరుగుతుందో… జగ్గారెడ్డికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మిగిలిన వారూ సైలెంటయిపోయారు.
వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వల్ల రేవంత్ రెడ్డి పలుకుబడి సాధించారు. ఆయన కష్టం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. జనాకర్షణ ఉన్న నేతకూడా కావడంతో.. వారు ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ చిత్తశుద్దిని వారెవరూ శంకించడం లేదు. సీనియర్లు చికాకు పెడుతున్నా.. రేవంత్ వారిపై పల్లెత్తు మాట అనడం లేదు. తన చేతలతోనే రేవంత్ హైకమాండ్ మెప్పు పొందారు.