తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్ లను నియమించిన తర్వాత… ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్ని రహస్య మిత్రుల కోసం… బలి చేశారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ తో ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడిన నేతలకు.. హైకమాండ్ ఇచ్చిన షాక్ దిమ్మతిరిగేలా చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడానికి బీజేపీ పార్టీని పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల్ని మార్చేశారు. తెలంగాణలో ఊహించని విధంగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి తెలంగాణ పార్టీ బాధ్యతలు కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించారు. బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ ను ప్రథమ టార్గెట్ గా పెట్టుకుంది. మూడు సార్లు దారుణమైన పరిస్థితుల్లో అరెస్టులు చేశారు. అయినా బండి సంజయ్ ఎక్కడా తగ్గలేదు. ఈ దూకుడే బీజేపీకి బీఆర్ఎస్తో పోటీ పడే పార్టగా మైలేజీ తీసుకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయనను తప్పించి ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ పై నేతల అసంతృప్తి అనే కారణం చెబుతున్నా.. బీజేపీ లాంటి పార్టీల నేతల అసంతృప్తి పెరగకుండా చేయాలనుకుంటే ఏం చేయాలో వారికి బాగా తెలుసు. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదన్నదే ఇక్కడ సందేహం.
బీఆర్ఎస్తో రాజకీయ అవగాహనకు రావడం. బండి సంజయ్ ను తప్పించడానికి ప్రధాన కారణం.. కేసీఆర్ ఒత్తిడేనని చెప్పుకోవడం. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.. తమ పార్టీ అధ్యక్షుడ్ని తప్పించాలని కేసీఆర్ లేదా కేటీఆర్ అడిగితే తప్పించేంత బలహీనంగా అమిత్ షా , ప్రధాని మోదీ ఉంటారని అనుకోరు. కానీ బీఆర్ఎస్ సర్కార్ పై తెగించి పోరాడుతున్న బండి సంజయ్ ను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు..అదీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ కాల్పుల విరమణ ఒప్పందం ఏదో చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్న సందర్భంలో తప్పించడం మాత్రం ఖచ్చితంగా అలాంటి అనుమానాలను సామన్యుల్లో బలపరిచేదే.
అంతే కాదు.. కుల సమీకరణాల్ని కూడా బీజేపీ హైకమాండ్ త్యాగం చేసింది. బండి సంజయ్ చీఫ్ గా ఉంటే మున్నూరు కాపు వర్గం బీజేపీకి అండగా ఉండేది. ఇప్పుడు ఆ వర్గానికి కోపం తెప్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని అనూహ్యంగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ఆలోచన ఉంటే ఎన్టీఆర్ కుమార్తెకు అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారని కూడా చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీ ముద్రను తుడిచేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఢిల్లీ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా హైకమాండే కుట్ర చేస్తోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.