లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఒకరి తర్వాత ఒకరు కోరస్ పాడుతున్న టీడీపీ నేతలుకు గట్టి సంకేతాలు వెళ్లాయి. ఇంకెవరి నోటి నుంచి ఆ మాట రాకూడదని హైకమాండ్ స్పష్టం చేసింది. పార్టీ నేతలందరికీ ఈ సందేశం వెళ్లింది. ఏదైనా కూటమిలో చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుటున్నామని అందుకే ఇంకెవరూ మాట్లాడవద్దని స్పష్టం చేసింది.
మొదట మహాసేన రాజేష్ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. తర్వాత చంద్రబాబు సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతలు తమ వాయిస్ వినిపించడం ప్రారంభించారు. చివరికి టీడీపీ హైకమాండ్ కు తెలిసే వీరంతా ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో హైకమాండ్ స్పందించింది.
కూటమిగా ఏర్పడినప్పుడు ప్రభుత్వంలో ఒక సీఎం, డిప్యూటీ సీఎం ఫార్ములాకు కట్టుబడ్డారని ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎం అంటే ఖచ్చితంగా కూటమిలో చర్చ జరగాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.అందుకే హైకమాండ్ ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తే పవన్ ప్రాధాన్యత తగ్గుతుందన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో ఉండటంతో సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.