కేబినెట్ విస్తరణతోపాటు పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో కూల్చివేతలపై అధిష్టానం కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టిన వైనంపై హైకమాండ్ పలు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ను ఆదేశించినట్లు సమాచారం.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ – మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బుల్డోజర్ విధానాలపై పోరాటం చేస్తోన్న తరుణంలో.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలోనూ అదే తరహ విధానం కొనసాగితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీ వేణుగోపాల్ హితోపదేశం చేసినట్లుగా తెలుస్తోంది.మూసీ బ్యూటిఫికేషన్ పై ప్రభుత్వ ఆలోచనను ఢిల్లీ పెద్దల ముందు ఉంచగా.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని రేవంత్ కు చెప్పినట్లుగా సమాచారం.
మూసీ సుందరీకరణ ప్రాధాన్యతను మూసీ బాధితులకు ముందుగా వివరించి, ప్రత్యామ్నయ మార్గాలను కల్పిస్తామని వారికీ భరోసా కల్పించాలని రేవంత్ ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అదే ఆలోచనతో ఉందని రేవంత్ వారి దృష్టికి తీసుకెళ్లగా..ఈ విషయంలో ప్రజా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.