కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల బహిష్కరణ వ్యవహారం తెలంగాణ సర్కారుకి ఎంత తలనొప్పిగా మారిందో తెలిసిందే. ఈ మధ్యనే హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ బాగా అక్షింతలు వేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ మధు సూధనాచారి ఎందుకు అమలు చేయడం లేదంటూ షో కాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందన్నట్టు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతీ తెలిసిందే. అయితే, మంగళవారం నాడు హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు టి. సర్కారుకు కొంత ఊరటనిచ్చాయనే చెప్పుకోవాలి.
కోమటిరెడ్డి, సంపత్ లను వెంటనే ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పు మీద డివిజన్ బెంచ్ రెండు నెలల స్టే విధించింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. దీంతో కేసీఆర్ సర్కారుకు తాత్కాలిక ఊరట లభించినట్టే అయింది. ఈ రెండు నెలల్లోపు శాసనసభ సమావేశాలు జరిగితే… ఆ ఇద్దరు సభ్యులూ హాజరయ్యే అవకాశం ఉండదనే చెప్పాలి. తెలంగాణలో ముందస్తు ఎన్నిక ఉంటుందనే ఊహాగానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… ఇవే చివరి సమావేశాలు కావొచ్చు. అలా అయితే, ఈ ఇద్దరి సభ్యుల బహిష్కరణ అంశాన్ని తెరాస సర్కారు దాదాపు దాటేసిన పరిస్థితే ఉంటుంది.
ఇంకోటి… ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మాటన్నారు! కోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయని నేపథ్యంలో ‘ఎవరి పరిమితుల్లో వారు ఉంటే బాగుంటుంది’ అన్నారు. హైకోర్టు ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ ఖాతరు చెయ్యాల్సిన పనిలేదనే ఒక అభిప్రాయం పెరగడం… ఇంకోపక్క, కోర్టు ఆగ్రహిస్తూ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం… ఇదంతా, ప్రజాస్వామ్యంలో రెండు ప్రధానమైన వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణంగా మారుతున్న పరిస్థితి. సరిగ్గా, ఇలాంటి సమయంలో రెండు నెలలపాటు కోర్టు స్టే విధించడం ఆ రకమైన ఘర్షణాత్మకమైన పరిణామాలు కూడా తాత్కాలికంగా తప్పినట్టుగా భావించాలి. సో… రెండు నెలలు సమయం ఉంది! ఈలోగా ఏదైనా జరగొచ్చు. కానీ, ప్రస్తుతం లభించిన ఊరట తాత్కాలికమే అయినా… కేసీఆర్ సర్కారుకు చాలా వరకూ టెన్షన్ తగ్గించిందనే చెప్పాలి.