ఏపీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటాయని.. హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు జరపాలని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా ఎస్ఈసీ కాలయాపన చేస్తున్నారని.. సెలవు పెడుతున్నారని ప్రభుత్వంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తక్షణం ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని వారు కోరారు. ముఖ్యమంత్రి జగన్ కూడా… వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డు వస్తున్నాయని ఆరు రోజుల్లో పూర్తి చేస్తే తర్వాత తీరిగ్గా వ్యాక్సినేషన్ వేయవచ్చని.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. చివరికి హైకోర్టు ఎన్నికలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని తేల్చేసింది. ఈ పిటిషన్‌పై విచారణలో ఎస్ఈసీ.. ఎన్నికల నిర్వహణ అనేది ఎస్ఈసీ పరిధిలో ఉంటుందని పదే పదే న్యాయస్థానాల జోక్యం సరి కాదని వాదించింది. ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. తొందరపడి పిటిషనర్లు హైకోర్టుకు వచ్చారని..స్పష్టం చేశారు. గత వారం ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పును ప్రకటించారు. దాని ప్రకారం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తయ్యే లోపు నిర్ణయం తీసుకుంటే.. షెడ్యూల్ వస్తుంది. లేకపోతే ఉండదు.
కొత్త ఎస్ఈసీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏమిటో కానీ మొదట నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరగకూడదని అనుకున్న ఏపీ సర్కార్ ఇప్పుడు మాత్రం ఆయనే ఎన్నికలు పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఆయన తన ఎల్టీసీని ఉపయోగించుకుని…. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకున్నా ప్రభుత్వ ప్రివిలేజ్ నోటీసుల పేరుతో… బెదిరించినంత పని చేసింది. అయినప్పటికీ… ఎస్ఈసీ నిమ్మగడ్డ వెనక్కి తగ్గలేదు. ఎన్నికలు నిర్వహించడానికి ఆయన సిద్ధంగా లేరు.