తెలంగాణ సర్కార్ ప్రజలను గాలి కొదిలేసిందని… కరోనా విషయంలో పట్టించుకోవడం లేదని.. తాము చెప్పినా.. కదలిక లేదని.. హైకోర్టు.. ప్రభుత్వంపై విరుచుకుపడటం సహజంగా మారిపోయింది. ప్రజలు వేసే పిటిషన్లు విచారణకు వచ్చిన సమయంలో.. తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కామన్‌గా మారిపోయింది. కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దులిపేసుకుంటోంది కానీ… న్యాయస్థానం ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. తాము చేయదు.. న్యాయస్థానం చెప్పినా పట్టించుకోదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు.
తెలంగాణలో వైరస్ ప్రభావం తీవ్రం..!
తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. చేతిలో లక్షలు పెట్టుకుని .. పేషంట్‌ను తీసుకుని ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్లు దొరకని పరిస్థితి. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉందో.. నల్లగొండలో.. ఓ వ్యక్తి.. ఊపిరి ఆడక.. తల్లి చేతుల్లో మృతి చెందిన దృశ్యాలు చెబుతూనే ఉన్నాయి. చేస్తున్న అతి కొద్ది టెస్టుల్లోనే… వస్తున్న వందల పాజిటివ్ కేసులను.. ఆస్పత్రుల్లో చేర్చుకోలేని దుస్థితి. హోం క్వారంటైన్లో ఉండే సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్న విషయాలనే పట్టించుకోకుండా.. అందర్నీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పి పంపిచేస్తున్నారు. చాలా మంది వద్ద సరైన అడ్రెస్‌లే తీసుకోవడం లేదు. ఫలితంగా.. చాలా మంది పాజిటివ్ పేషంట్లు.. జనంలోకి కలిసిపోతున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.
టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ .. అన్నింటిలోనూ నిర్లక్ష్యమే..!
టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ అనే విధానంతో కరోనాను కంట్రోల్ చేయగలమని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. కేంద్రం కూడా అదే చెబుతోంది. అయితే.. తెలంగాణ సర్కార్ మాత్రం.. ఈ మూడింటిలోనూ విఫలమయిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. టెస్టింగ్‌లో ఎక్కడో ఉంది. ట్రేసింగ్ అనే మాటనే ప్రస్తుతానికి ఆపేశారు. ఇక ట్రీట్మెంట్ అనేది ఎవరికి అందుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే.. హైకోర్టు పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ప్రజలకు జీవించే హక్కు ఉందని.. ప్రభుత్వం అది లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు.
హైకోర్టు ధర్మాగ్రహాన్ని పట్టించుకోకపోవడం దేనికి సంకేతం..?
మొదట్లో వైరస్‌ను అంతం చేస్తామని ధీమా వ్యక్తం చేసిన … తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తర్వాత .. కరోనాతో కలిసి జీవించాల్సిందేననే అభిప్రాయానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన కరోనాపై చర్యల విషయంలో లైట్ తీసుకుంటున్నారు. ఎలాంటి సమీక్షలు చేయడం లేదు. నిన్నామొన్నటిదాకా పట్టించుకున్న ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో దారుణమైన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఈ విషయంలో.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. ఇచ్చినా.. పాటించకపోయినా.. ఏమీ కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోందని.. న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ప్రజల కోణంలో ఆలోచిస్తే మాత్రం.. హైకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేసేవారని అంటున్నారు. కానీప్రభుత్వం ఆ కోణంలో ఆలోచన చేస్తున్నట్లుగా కనిపించడం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయంటున్నారు.