మే నెలాఖరు కల్లా.. మూడు రాజధానుల్ని ఉనికిలోకి తేవాలనుకున్న ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తుగా కర్నూలుకు విజిలెన్స్, ఎంక్వయిరీస్ కమిషనరేట్‌ను తరలించడానికి ఇచ్చిన జీవోలను హైకోర్టు నిలుపుదల చేసింది. జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలను న్యాయరాజధానిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు.. విజిలెన్స్, ఎంక్వయిరీస్ కమిషనరేట్‌ను తరలించాలని జనవరి 31వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. అర్థరాత్రి పూట వచ్చిన ఈ ఉత్తర్వులు కలకలం రేపాయి. దానికి కారణం.. అంతకు ముందే హైకోర్టు.. ఎలాంటి కార్యాలయాల తరలింపు చేపట్టవద్దని … ఆదేశించింది. చట్టం అయ్యేంత వరకూ.. ఎలాంటి శాఖల తరలింపు చేపట్టవద్దని.. అలా చేస్తే.. తాము అధికారుల వ్యక్తిగత ఖాతాల నుంచి సొమ్ము వసూలు చేస్తామని హెచ్చరించింది.
ఏసీబీ, సీబీఐ విచారణ జరిపిస్తామని కూడా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంది. విశాఖకు ఆఫీసుల తరలింపు విషయంలో ఇబ్బందులు ఎదురవకుండా.. ముందుగా కర్నూలుకు కొన్ని కార్యాలయాలు తరలించాలనే వ్యూహాన్ని ఏపీ సర్కార్ అమలు చేయాలనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కర్నూలుకు తరలిస్తే ఎవరూ అడ్డుకోలేరని.. ఎవరైనా అడ్డుకున్నా.. రాజకీయంగా దూకుడైన ప్రకటనలతో దూసుకెళ్లవచ్చని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పుడు హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలడం ఇదే మొదటి సారి కాదు. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయానికి చట్టపరమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. అన్ని వ్యవస్థల్ని ధిక్కరించేలా నిర్ణయాలు తీసుకుంటూండటంతో ఆయా వ్యవస్థలు.. వాటిని నిలుపుదల చేస్తున్నాయి. ఫలితంగా.. తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది.