వాలంటీర్ల అంశం హైకోర్టుకు చేరింది. రాజకీయ కక్షతో తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా వాలంటీర్లు నిలిపివేశారని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తామంతా పథకానికి అర్హులమేనని వారు వాదిస్తున్నారు. కేవలం వాలంటీర్లు రాజకీయ కారణాలతోనే తమకు పథకం అందకుండా చేశారన్నారు. ఈ పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. విచారణలో వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సంక్షేమ పథకాల లబ్దిదారులను వాలంటీర్లు ఎంపిక చేయడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది . వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కదా ? వారికి డబ్బులెలా ఇస్తారు? అని హైకోర్టు ప్రశ్నించింది. పెపెన్షన్దారుల సొమ్ముతో వలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రిక వార్తలను హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తావించారు. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. లబ్దిదారులను వాలంటీర్లు ఎంపిక చేస్తూంటే సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు పశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారి చేసింది.
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించింది. ప్రభుత్వ పథకాలు సహా మొత్తం వారి ద్వారానే ఆ యాభై ఇళ్లకు చేరేలా ఏర్పాట్లు చేసింది. చివరికి లబ్దిదారులు కూడా వారినే సంప్రదించి.. తమ అర్హతను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపికలో తమకూ ప్రమేయం లేదని. ఎమ్మెల్యే కంటే వాలంటీర్కే ప్రాధాన్యం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే వాస్తవంగా వారికి ఎలాంటి చట్టబద్దమైన అధికారులు లేవు. ఈ అంశం ఇప్పుడు కోర్టులో విచారణకు రావడంతో ఈ వ్యవస్థను చట్టబద్దంగా ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.