నిరుద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, తెలంగాణ తెచ్చుకున్న, దాని ద్వారా సాధించాలనుకున్న వాటిలో ప్రధాన లక్ష్యమైన ఉద్యోగాల కల్పన అనే విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని టిజెఎసి నేత కోదండరాం పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు. వీటిని ప్రభుత్వం ఎంత మాత్రం సీరియస్గా పరిగణించకపోవడంతో… ఆయన మరో అడుగు ముందుకేశారు. దీనిపై విద్యార్ధుల మద్ధతు కూడగట్టేందుకు ఉద్యమాన్ని తలపెట్టారు. అందులో భాగంగానే కొలువుల కొట్లాట పేరుతో ఒక సభను కూడా ఆయన తలపెట్టారు.
అయితే… పలు అంశాలపై కెసియార్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న టిజెఎసి తలపెట్టిన కొట్లాట సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన టిజెఎసికి నిరాశ ఎదురైంది. అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం హైకోర్టు కొట్టేసింది. ఈ నేపధ్యంలో… ఈ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాలని పట్టుదలతో ఉన్న టిజెఎసి కోర్టు నిర్ణయంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
కొత్త సచివాలయంపై విచారణ వాయిదా…
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని మార్చి, కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా, ప్రజాధనం వృధా అవుతోందంటూ విపక్షాలు కోర్టు కెక్కాయి. ఈ నేపధ్యంలో సోమవారం ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు… తదుపరి విచారణను మంగళవారంకు వాయిదా వేసింది.