ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ పి భోస్లే నిన్న బదిలీ అయ్యారు. ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సంప్రదాయం ప్రకారం హైకోర్టులో అందరి కంటే సీనియర్ న్యాయమూర్తి రమేష్ రంగనాధన్ ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉంది. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనే ఇన్-ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు.
జస్టిస్ దిలీప్ పి భోస్లే వీడ్కోలు కార్యక్రమంలో ఇటీవల జరిగిన కొన్ని అవాంఛనీయ పరిణామాల గురించి మాట్లాడుతూ, “న్యాయమూర్తుల నియామకాల జాబితాలో అందరికీ ఆమోదయోగ్యంగా మార్పులు చేర్పులు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, న్యాయమూర్తులు రోడ్డెక్కడంతో తప్పనిసరి పరిస్థితులలోనే న్యాయవ్యవస్థ గౌరవం కాపాడేందుకు నేను కటినంగా వ్యవహరించాను తప్ప నాకు ఎవరి పట్ల ఎటువంటి భేదభావం లేదు. నా నిర్ణయాలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించమని కోరుతున్నాను. కొన్ని విభేదాలు ఏర్పడినప్పటికీ అందరం ఒకే కుటుంబ సభ్యులలాగ మెలిగాము. ఇంతకాలం నాకు తోడ్పాటు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు,” అని అన్నారు.
ఆయన బదిలీ సాధారణంగా జరిగిన బదిలీ కాదని చెప్పక తప్పదు. న్యాయమూర్తుల నియామకం, వారిపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి చర్యలకి ఆగ్రహించిన తెలంగాణా న్యాయవాదులు ఆయనని తక్షణమే బదిలీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ని కలిసి ఒత్తిడి చేశారు. వారు సమ్మె విరమించి మళ్ళీ విధులలో చేరితే వారి సమస్యలన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. కనుక ఆ హామీ ప్రకారమే జస్టిస్ దిలీప్ పి భోస్లే బదిలీ చేసి ఉండవచ్చు. న్యాయమూర్తుల నియామకాల జాబితాలో అందరికీ ఆమోదయోగ్యంగా మార్పులు చేర్పులు జరుగుతాయని జస్టిస్ దిలీప్ పి భోస్లే స్వయంగా నిన్న చెప్పారు కనుక న్యాయవాదుల రెండవ డిమాండ్ కూడా నెరవేర్చబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక మిగిలింది హైకోర్టు విభజన డిమాండ్. బహుశః దానికి మార్గం సుగమం చేయడానికే, హైకోర్టు విభజనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్షించడానికి ఆ కేసుని నిన్ననే హైకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయబడింది. కనుక వారి మూడవ డిమాండ్-హైకోర్టు విభజన కోసం కూడా తెర వెనుక చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లే భావించవచ్చు. జస్టిస్ దిలీప్ పి భోస్లే స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ హైకోర్టు విభజన జరుగనంత వరకు ఆయన కూడా ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవలసి రావచ్చు.