స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం వాళ్ల కోసం చేయలేదు.. దేశ ప్రజల కోసమే చేశారు. అలాగే రాజధానికి 30వేల ఎకరాలిచ్చిన రైతులు తమ కోసమే రాజధాని అన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. రాజధాని రాష్ట్ర ప్రజలందరిదీ అని హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రారంభమైన విచారణలో రైతుల తరపు న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. ఆయన వాదనలు మంగళవారం కూడా కొనసాగాయి.
ఈ విచారణ కొనసాగుతున్న సమయంలో ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. సోమవారం విచారణ ప్రారంభమైన సమయంలో ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు బెంచ్‌లో ఉండకూడదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అయితే వారి విజ్ఞప్తిని తోసి పుచ్చిన ధర్మానసం విచారణ కొనసాగిస్తోంది.
రాజధాని పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్లుగా ఉందని వ్యాఖ్యానించిన సీజే వీలైనంత త్వరగా పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో రోజువారి విచారణ కొనసాగిస్తున్నారు. హైబ్రీడ్ పద్దతిలో కొనసాగుతున్న విచారణలో రైతులతరపు న్యాయవాది శ్యాందివాన్ వాదనలు సుదీర్ఘంగా వినిపిస్తున్నారు.