ఓపక్క రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఒక్కోటిగా కేంద్రమే నిర్వీర్యం చేస్తోందని మోడీ సర్కారు విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకోపక్క, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఆ పార్టీయే రథయాత్రలకు బయల్దేరాలనుకోవడం విశేషం! కోల్ కతాలో ప్రజాస్వామ్య పరిరక్షణ రథయాత్రను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించేందుకు భాజపా సిద్ధమైంది. అధ్యక్షుడు అమిత్ షా ఈ యాత్రలో పాల్గొనాల్సి ఉంది. తాను ఈ యాత్రకు రాబోతున్నట్టుగా ఇప్పటికే ఆయనా ప్రకటించేశారు. అయితే, ఈ యాత్రకు కోల్ కతా హైకోర్టు బ్రేకులు వేసింది. నిజానికి, ఈ యాత్ర షెడ్యూల్ వెలువడగానే అనుమతులు లేవంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మమతా బెనర్జీ నిర్ణయంపై రాష్ట్ర భాజపా శాఖ హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రంలో వరుసగా మూడు యాత్రలు నిర్వహించాలని అమిత్ షా అనుకున్నారు. శుక్రవారం నాడు కూచ్ బీహార్ నుంచి ఇది ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ ప్రాంతం మతపరంగా చాలా సున్నితమైందనీ, అమిత్ షా యాత్ర వల్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ వాదనలతో ఏకీభిస్తూ అమిత్ షా యాత్రను ఆపాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసేసింది. దీంతో అమిత్ షా యాత్రకు మమతా సర్కారు బ్రేకులు వేసినట్టుయింది.
ఇంతకీ, ఈ రథయాత్ర లక్ష్యం ఏంటంటే… వచ్చే లోక్ సభ ఎన్నికలే! రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ నియోజక వర్గాలను కవర్ చేస్తూ అమిత్ షా టూర్ ప్లాన్ చేసుకున్నారు. కనీసం పాతిక సీట్లనైనా బెంగాల్ లో సాధించాలనే లక్ష్యంతో అమిత్ షా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఇప్పటికే స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేశారు. ఇంకోటి… అన్ని రాష్ట్రాల్లోనూ భాజపా జెండా పాతాలనే లక్ష్యం కూడా వారి ప్రధాన అజెండాలో ఉన్నదే కదా. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పై షా దృష్టి ఉంది.
అయితే, దీనికి ధీటుగానే ఈ మధ్య స్పందిస్తూ వచ్చారు మమతా బెనర్జీ. ఒకవేళ భాజపా రథయాత్ర నిర్వహిస్తే… ఆ మార్గాన్ని పరిశుద్ధం చేస్తూ తాము పవిత్ర యాత్ర చేస్తామన్నారు. అమిత్ షా చేసేది కేవలం రాజకీయ యాత్ర మాత్రమేననీ, ఆయన జగన్నాథుడి కోసమో, లేదా శ్రీకృష్ణుడి కోసమే రథం ఎక్కడం లేదంటూ ఇటీవలే త్రిణమూల్ కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు. అదే సమయంలో భాజపా కూడా ఈ యాత్రల్ని సీరియస్ గానే తీసుకుంది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రంగంలోకి దించాలనుకుంది. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యాత్రలో పాల్గొంటారనీ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు కోర్టు బ్రేకులు వేసింది. విచిత్రం ఏంటంటే… ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ యాత్రకు బయల్దేరినప్పుడు, కేవలం ఒక మతానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా రథయాత్రను డిజైన్ చేసుకోవడం! తమకంటూ ఒక ఓటు బ్యాంక్ సృష్టించుకునే క్రమంలో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలను చేపట్టడమేనా భాజపాకి తెలిసిన ప్రజాస్వామ్య రక్షణ అనేది కొంతమంది విశ్లేషకుల ప్రశ్న?