ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలకు.. పదవులు నిలబడలేదు. రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో.. పార్టీని ధిక్కరించిన వారిపై కేసీఆర్ వేగంగా చర్యలు తీసుకున్నారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు.. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై శరవేగంగా అనర్హతా వేటు కూడా వేయించారు. అలాంటి వారిలో.. రాములు నాయక్, యాదవరెడ్డి కూడా ఉన్నారు. అయితే.. రాములు నాయక్ తాను.. పార్టీ పరంగా ఎమ్మెల్సీగా ఎన్నికవలేదని.. గవర్నర్ కోటాలో.. ఎమ్మెల్సీ అయ్యానని.. అనర్హతా వేటు తనకు వర్తించదని హైకోర్టుకు వెళ్లారు. అలాగే యాదవరెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. చెబుతూ… తనపై అన్యాయంగా అనర్హత వేటు వేశారని వాదిస్తూ.. పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు.. తోసి పుచ్చింది. రాములునాయక్, యాదవరెడ్డి అనర్హత వేటును హైకోర్టు సమర్థించింది. శాసనమండలి ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని కల్పించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు… న్నికలు నిర్వహించకుండా ఆపాలని పిటిషనర్ల తరపు లాయర్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వని న్యాయస్థానం.. పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించాలని ఈసీ సూచించింది.
గతంలో.. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ.. అనర్హతా వేటు వేసిన ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేయబోమని.. ఈసీ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో.. ఎమ్మెల్సీస్థానాలను భర్తీ చేయడానికి ఈసీకి లైన్ క్లియర్ అయినట్లయింది. అయితే.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారు. అక్కడ ఊరట లభించకపోతే.. కొత్తగా టీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు ఎమ్మెల్సీసీట్లు చేరుతాయి.