రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామిని కష్టాలు వీడటం లేదు. ఆయనకు ఇట్టే బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయన చానల్ సిబ్బంది..బీజేపీ నేతలకు కాలం కలసి రాలేదు. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మరోసారి కొట్టి వేసింది. ఆర్నాబ్ డబ్బులు ఎగ్గొట్టిన ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో కొత్త ఆధారాలు దొరికాయని పోలీసులు మూసేసిన కేసును తెరిచి నాలుగో తేదీన అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి హైడ్రామా నడుస్తోంది. రిపబ్లిక్ చానల్లో మరే వార్తలు వేయడం లేదు. మొత్తంగా దేశం మొత్తం ఆర్నాబ్ వెంటే ఉందన్నట్లుగా బ్రేకింగ్‌లు న్యూస్‌తో హడావుడి చేస్తున్నారు.
చోటా బీజేపీ నేతలు ర్యాలీ తీసిన లైవ్ పెట్టి చూపిస్తున్నారు. మరో వైపు అరెస్ట్ తర్వాత ఆర్నాబ్‌ను నిబంధనల ప్రకారం ఓ కరోనా కేంద్రంలో ఉంచారు. అక్కడ ఆయన వేరే వారి ఫోన్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపైనా పోలీసులు మరో కేసు నమోదు చేసి.. నిబంధనలు ఉల్లంఘించినందున జైలుకు తరలించారు. ఆర్నాబ్ ను అరెస్ట్ చేయడంపై కేంద్రమంత్రి అమిత్ షా సహా అనేక మంది బీజేపీ ప్రముఖులు భగ్గుమన్నారు. అయినప్పటికీ ఆయనకు బెయిల్ దక్కడం లేదు. కేసు జర్నలిజానికి సంబంధించినది కాకపోవడంతో… ఎవరూ సమర్థించలేకపోతున్నారు.
ఆర్నాబ్ మార్క్ అరుపులు కేకల.. టీవీ చర్చలు లేక.. ఆర్నాబ్ కోసం పోరాటం చేస్తూ.. రపబ్లిక్ చానల్ లైట్‌గా మారిపోతోంది. ఆర్నాబ్ కోసం ట్వీట్లు.. పిటిషన్ల క్యాంపెయిన్ చేస్తూ.. తన యజమాని కోసం రిపబ్లిక్ టీవీ గుక్క పెడుతోంది. మహారాష్ట్ర సర్కార్ ఆర్నాబ్ సంగతి అటో ఇటో తేల్చాలని అనుకుంటోంది. అందుకే.. ఆయనకు ఇప్పుడల్లా బెయిల్ రావడం కూడా కష్టమని అంటున్నారు.