హైకోర్టు విభజనపై తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరుతూ తెలంగాణా ప్రభుత్వం వేసిన పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ, ఆ కేసుని హైకోర్టు విస్తృత ధర్మాసనానికి బైలీ చేస్తూ ఇవ్వాళ్ళ తీర్పు చెప్పింది.
ఏపికి కానీ తెలంగాణాకి గానీ హైదరాబాద్ లోనే వేరేగా హైకోర్టు ఏర్పాటు చేసేందుకు గత ఏడాది కేంద్రప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వం సిద్దమయ్యాయి. కానీ అంతకు ముందు ఈ హైకోర్టు విభజన అంశంపై దాఖలయిన ఒక పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలి తప్ప వేరే రాష్ట్ర భూభాగంపై ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ చేయదలిస్తే విభజన చట్టం సవరణ చేయాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేసుకొనే వరకు ప్రస్తుత హైకోర్టే రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని తీర్పు చెప్పింది. దానితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బ్రేకులు పడ్డాయి.
ఆ తీర్పుని పునః సమీక్షించుకోవాలనే తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధనని హైకోర్టు మన్నించి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడంతో విభజనకి సానుకూలంగా ఉన్నట్లు సూచించినట్లయింది. హైకోర్టు విభజనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు, ఇప్పుడు ఏపి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది కనుక అందుకు మార్గం సుగమం చేస్తూ హైకోర్టు తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవడానికి అంగీకరించినట్లు భావించవచ్చు. భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఈ సమస్య పరిష్కరిస్తానని తెలంగాణా న్యాయవాదులకి హామీ ఇచ్చారు కనుక బహుశః ఆయన సూచనల మేరకే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునేమో. ఒకవేళ వెలగపూడిలో తాత్కాలిక హైకోర్టు నిర్మించే ప్రతిపాదనని పక్కనబెట్టి ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లయితే హైదరాబాద్ లోనే ఏపికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవవచ్చు.