తెలంగాణ సాంస్కృతిక శాఖలో నియామకాలు సరిగా జరగలేదనీ, మళ్లీ నియామకాలు చేపట్టాలంటూ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రం వచ్చాక.. ఉద్యమ సమయంలో సేవలందించిన కళాకారులకు ప్రతీనెలా వేతనాలు ఇవ్వాలని కేసీఆర్ సర్కారు భావించింది. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానించి, ఒక జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఉద్యమ సమయంలో పాల్గొన్నవారిలో సీనియారిటీ ప్రాతిపదికనే ఈ వేతనాలు అందించాలని నిర్ణయించారు. దాదాపుగా 550 మందిని సాంస్కృతిక శాఖలో కళాకారులుగా నియమించారు.
అయితే, కళాకారుల నియామక ప్రక్రియ పాదర్శకంగా లేదనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. తనకు ఇష్టమైన వారికే రసమయి బాలకిషన్ అవకాశాలు కల్పించుకున్నారనీ, అర్హులను పక్కన పడేశారంటూ విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే అంశమై కొంతమంది కళాకారులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. దీంతో నియాక ప్రక్రియలో పారదర్శక లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లో కొత్త నియామకాల ప్రక్రియ పూర్తి కావాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలపై రసమయి బాలకిషన్ తాజాగా స్పందించారు. నియామకాలు అన్నీ పారదర్శకంగానే జరిగాయని అంటున్నారు. అవకాశం రానివారు తామే అర్హులమని అనుకోవడం సహజమని అన్నారు. తొలివిడతగా కొంతమందికి అవకాశం ఇచ్చామనీ, రెండో విడత మరింత మందికి అవకాశం వస్తుందని రసమయి చెప్పారు. అయితే, తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్టుగానే కళాకారుల జీవనోపాధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసే శక్తులు కొన్ని ఉన్నాయని రసమయి ఆరోపించారు! ప్రస్తుతం ఎంపిక చేసిన కళాకారులను కొనసాగిస్తూనే… తరువాత ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తామన్నారు. రెండో విడత ఎంపిక చేసే వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. ఏదేమైనా, కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో రాజకీయంగా విమర్శలకు ఆస్కారం ఉందనే చెప్పాలి. కళాకారుల గురించి గొప్పగా చెప్పుకునే కేసీఆర్, వారి పాలనలో ఇలాంటి అన్యాయం జరుగుతోందన్న అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన రసమయి విషయంలో కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.