హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్వారి బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసినందుకుగానూ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ దాఖలుచేసిన పిటిషన్పై స్పందిస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శికి సమన్లు పంపాలని ఛీఫ్ జస్టిస్ దిలీప్ భోసలే, జస్టిస్ ఎస్.వి.భట్లతోకూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆస్తులు, అప్పుల విభజన, వేర్వేరు ఇంటర్మీడియెట్ బోర్డుల ఏర్పాటు, వేర్వేరు బ్యాంక్ ఖాతాల ప్రారంభం జరిగిన తర్వాతకూడా తెలంగాణ అధికారులు తమ ఖాతాను స్తంభింపజేశారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులుకూడా తమను సంప్రదించకుండా తెలంగాణ అధికారుల సూచనప్రకారం తమ ఖాతాను స్తంభింపజేశారని ఆరోపించారు. దీనితో తమ బోర్డ్ కార్యకలాపాలన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏపీ ఖాతాను స్తంభింపజేసేముందు బ్యాంక్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకోవటంగానీ, కోర్టును సంప్రదించటంగానీ చేసి ఉండాల్సిందని హైకోర్ట్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఖాతాను స్తంభింపజేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పటానికి తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శిని కోర్టుకు పిలిపించాలని నిర్ణయించింది.