తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. గవర్నర్ కోటా లో శాసనమండలి సభ్యుల నియామకాలపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం , ఆమిర్ అలీఖాన్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టి వేసింది. నిజానికి వీరిద్దరినీ నియమించి ప్రభుత్వం కాదు. గవర్నరే. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది. ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియామించడంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం చెప్పిన న్యాయస్థానం…గత మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించాల్సి కాదని, వెనక్కి పంపి ఉంటే బాగుండేదని కోర్టు అభిప్రాయపడింది.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణలను సిఫారసు చేశారు. అయితే వారిని గవర్నర్ తిరస్కరించారు. తర్వాత వారి పేర్లనే మళ్లీ కేబినెట్ సిఫారసు చేసి ఉంటే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉండేది. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. వారికి బదులుగా ఇతరుల్ని కూడా సిఫారసు చేయలేదు. మళ్లీ గెలుస్తామన్న నమ్మకంతో. అలాగే ఉండిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ కేబినెట్ ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నియామకాన్ని సవాల్ చేస్తూ…బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.గవర్నర్ నిర్ణయాలను కోర్టు నిర్దేసించలేదని రాజ్ భవన్ తరపు న్యాయవాది వాదించారు. అందుకే హైకోర్టు.. ప్రభుత్వ గెజిట్ ను కొట్టి వేసింది. వాస్తవంగా గత కేబినెట్ తీుకున్న నిర్ణయాలను అధికారికంగా గవర్నర్ తిరస్కరించేశారు. ఇప్పుడు వారి పేర్లను మళ్లీ పరిశీలించడం సాధ్యం కాదు. నిబంధనల ప్రకారం.. మళ్లీ కేబినెట్ సిఫారసు చేయాల్సిందే. అయితే హైకోర్టు తీర్పులో పాత అభ్యర్థుల్ని పరిశీలించాలని ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.