ఉపాధి బిల్లులపై చివరికి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ కాలం సాగిన విచారణలో చివరికి చిరు కాంట్రాక్టర్లు విజయం సాధించారు. అయితే హైకోర్టు తీర్పును ఎంత వరకూ ప్రభుత్వం అమలు చేస్తుందనే దానిపై సందేహం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఉపాధి హామీ పథకం బిల్లులపై 1013 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బిల్లుల చెల్లింపులను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే మిగతా బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది.
దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు పరిష్కారం అయ్యాయి. 2018-19 సమయంలో ఉపాధి పనులు చేసిన వారికి.. వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పనులు చేసిన వారిలో అత్యధికం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఉన్నారు. ఈ కారణంగా వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వారంతా న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రభుత్వం దిగిపోయే నాటికి చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు నిలిపివేశారు.
నిజానికి ఈ పనులకు నిధులు ఇచ్చేది కేంద్రం ప్రభుత్వం. లెక్క ప్రకారం కేంద్రం మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనుల్లో అక్రమాలు జరిగాయన్న కారణంగా చెల్లింపులు నిలిపివేసింది. ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించుకుంది. అప్పట్నుంచి చెల్లింపులు చేయలేదు. ఇప్పుడు కోర్టు తీర్పుతో చెల్లింపులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.