శివాజీని దుబాయ్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపడానికి కారణం… తమకు తెలియదని హైదరాబాద్ పోలీసులు చెప్పినదంతా అబద్దమేనా..? ఉద్దేశపూర్వకంగానే… శివాజీపై లుకౌట్ నోటీసులు ఎత్తి వేయాలని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఎత్తివేయలేదా..?. తాజాగా శివాజీ వేసిన ఓ పిటిషన్పై.. హైదరాబాద్ పోలీసుల వాదన ఇంతే ఉంది. సమాచార లోపం వల్లే.. హైకోర్టు ఆదేశించినప్పటికీ.. లుకౌట్ నోటీసులు ఎత్తి వేయలేకపోయామని.. ఇండియాలో ఎవరూ.. శివాజీని అడ్డుకోలేదని.. విదేశాల్లోనే అడ్డుకున్నారని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకొచ్చారు.
గత నెల ఇరవై నాలుగో తేదీన శివాజీ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. 25వ తేదీన శివాజీని దుబాయ్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. కోర్టు ఉత్తర్వులను తెలంగాణ పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. శివాజీ మరో సారి హైకోర్టులో పిటిషన్ వేశారు. లుకౌట్ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు తొలగించలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారన్నారు.
ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లో లుకౌట్ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని శివాజీ న్యాయవాది కోరారు. అయితే పోలీసులు మాత్రం.. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని హైకోర్టుకు తెలిపారు. దీంతో.. సమాచారలోపం వల్ల ఇదంతా జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. శివాజీ మూడు వారాల వరకు అమెరికా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.