ఏపి శాసనసభ సమావేశాలలో తప్పకుండా ప్రస్తావించే విషయం ఒకటుంటుంది. అది ప్రజా సమస్యల పరిష్కారం గురించో లేకపోతే ముఖ్యమయిన బిల్లులు ఆమోదించడం గురించో కాదు. జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించగానే “అక్రమాస్తుల కేసులో ప్రతీ శుక్రవారం కోర్టుకి వెళ్ళే నువ్వా మమ్మల్ని ప్రశ్నించేది?” అనే మాట వినబడుతుంది. కానీ ఇకపై తెదేపా నేతలకు ఆ అవకాశం లేకుండాపోయింది. కనీసం ఆ వాక్యాన్ని సవరించుకొని “ప్రతీ మూడు నెలలకోసారి కోర్టుకు వెళ్ళే నువ్వా…” అని మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ కేసుల్లో విచారణకు ప్రతీ శుక్రవారం సిబీఐ కోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని జగన్మోహన్ రెడ్డి పెట్టుకొన్న విన్నపాన్ని మన్నించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో ఆయనకు మూడు నెలల పాటు మినహాయింపునిస్తూ నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును మళ్ళీ జూలై 1కి వాయిదా వేశారు.
జగన్మోహన్ రెడ్డితో బాటు ఈ కేసులలో ఒక దానిలో నిందితుడిగా ఉన్న దాల్మియా సిమెంట్స్ కి చెందిన పునీత్ దాల్మియాకి నాలుగు వారాలపాటు మినహాయింపునిచ్చారు. అలాగే ఇదే కేసులలో నిందితుడిగా ఉన్న పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డిపై విచారణను, హాజరును నిలిపివేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను ఏప్రిల్ 20వరకు పొడిగిస్తూ తాజాగా మళ్ళీ ఆదేశాలు జారీ చేసారు.
వారు ముగ్గురితో బాటు ఈ కేసులలో నిందితుడుగా ఉన్న గృహ నిర్మాణ మండలి చైర్మన్ ఎస్.ఎన్.మహంతిని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే సిబీఐ విచారిస్తున్న సంగతి తెలుసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో ఆయనపై విచారణను కూడా నిలిపివేస్తూ నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కేసును ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.
వారిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, శాసనసభ సభ్యుడిగా ఉన్నందున, రాజకీయ కార్యకలాపాలకు హాజరు కావలసి ఉంటుంది కనుక ప్రతీ శుక్రవారం సిబీఐ కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు కోరితే, దాల్మియా, ప్రతాప్ రెడ్డి తమ వ్యాపారపనులకు ఆటంకం కలుగుతోంది కనుక మినహాయింపు కోరారు. ముగ్గురికీ కూడా హైకోర్టు మినహాయింపు ఇవ్వడం విశేషం. అయితే జగన్మోహన్ రెడ్డికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరాలనే ఈ ఆలోచనకి ప్రేరణ శాసనసభలో తెదేపా నేతల వ్యాఖ్యలేనని అయ్యుండవచ్చును.