ఇప్పటంలో ఇళ్లు కూల్చివేయవద్దని హైకోర్టును ఆశ్రయించిన వారికి గట్టి షాక్ తగిలింది. ఒక్కొక్కరు రూ.లక్ష కట్టాలని హైకోర్టు జరిమానా విధించింది. మొత్తం 14 మంది.. ఇలా రూ. 14 లక్షలు కట్టాల్సి ఉంది. హైకోర్టు వీరికి జరిమానా విధించడానికి కారణం… తమకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని చెప్పి.. కూల్చివేతలపై స్టే తెచ్చుకోవడం. హైకోర్టును తప్పుదోవ పట్టించారని చెప్పి న్యాయమూర్తి ఈ జరిమానా విధించారు.
ననంబర్ నాలుగో తేదీన ఇప్పటం గ్రామ రోడ్డులో ఉన్న 53 ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో తమకు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అప్పటికప్పుడు హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. కానీ కూల్చివేతలు నిబంధనల ప్రకారమే చేస్తున్నామని.. పరిహారం ఇవ్వడానికి ప్రైవేటు స్థలాల్లోఇళ్లను కూల్చివేయలేదని.. రోడ్డు మీదే వారు ఇళ్లు కట్టుకున్నారని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
విచారణలో నోటీసులు ఇచ్చినట్లుగా రైతులు అంగీకరించారు. అయితే తమకు సమాచారం లేదన్నారు. అవగాహన లేదన్నారు. కానీ కోర్టు అంగీకరించలేదు. కూల్చివేసిన యాభై మూడు ఇళ్ల కుటుంబాలకు.., కుటుంబానికి రూ. లక్ష చొప్పున పవన్ ఆర్థిక సాయం ప్రకటించారు. వచ్చే శనివారం వాటిని పవన్ కల్యాణ్ పంపిణీ చేయనున్నారు. కూల్చివేసిన ఇళ్ల ముందు.. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని.. రాజకీయం చేసి.. తమను ఇబ్బంది పెట్టవద్దన్న పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ అంశం మరింత రాజకీయం అయింది.