తెలంగాణా యూనివర్సిటీలకి వైస్-ఛాన్సిలర్ల నియామకంలో తెలంగాణా ప్రభుత్వం తొందరపడిందా? అంటే అవుననే హైకోర్టు అంటోంది. అనడమే కాదు వారి నియామకాల కోసం తెలంగాణా ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే జారీ చేసిన ఉత్తర్వులని కూడా ఇవాళ్ళ రద్దు చేసి, విసిలకి, ప్రభుత్వానికి కూడా షాక్ తినిపించింది.
తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకి విసిలని నియమించాలనుకొంది. అయితే అందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నియమ నిబంధనలు అవరోధంగా ఉన్నట్లు భావించి, విభజన చట్టంలోని సెక్షన్: 101 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల నిబంధనలు సవరించింది. సవరించిన చట్టప్రకారం విసిల నియామకం కోసం తెలంగాణా ప్రభుత్వం యూజిసి నిబంధనలని పాటించనవసరం లేదు. అలాగే ఆ నియామకాల కోసం గవర్నర్ అనుమతి తీసుకోనవసరం లేదు.
అయితే దాని నిర్ణయాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డా. మనోహర్ అనే ప్రొఫెసర్ హైకోర్టులో సవాలు చేస్తూ 2015లో ఒక పిటిషన్ వేశారు. దానిపై జరుగుతున్న విచారణ ఒక కొలొక్కి వస్తోంది. దానిలో తెలంగాణా ప్రభుత్వం కూడా పాల్గొంటూనే ఉంది కనుక దానికీ ఈ విషయం తెలుసు. కోర్టులో కేసు నడుస్తోందని, దానిపై త్వరలో తీర్పు వెలువడుతుందని తెలిసి ఉన్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం తొందరపడి మొన్న సోమవారం ఆరు యూనివర్సిటీలకి విసిలని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆవిధంగా ఎందుకు తొందరపడిందో దానికే తెలియాలి. హైకోర్టు కూడా అదే ప్రశ్నించింది. ఈ రోజు వారి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని రద్దు చేస్తూ తీర్పు చెప్పడంతో విసిలుగా నియమితులైన వారు ఇంకా బాధ్యతలు చేపట్టక మునుపే తమ పదవులు కోల్పోయినట్లయింది. అందుకు తెలంగాణా ప్రభుత్వాన్నే నిందించవలసి ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టకి భంగం కలిగించేదే కనుక బహుశః వారినే కొనసాగించడానికి మళ్ళీ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడమో లేదా న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయించడం చేయక తప్పదు.