ప్రాథమిక దర్యాప్తులో ఏం వివరాలు తేలాయని హైకోర్టు న్యాయమూర్తి అడిగారు..! విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయమూర్తికి నేరుగా చెప్పేశారు. ఆ న్యాయవాది సమాధానం విని… కోర్టు హాల్లోని ఇతర న్యాయవాదులు ఉలిక్కి పడ్డారు. హైకోర్టు న్యాయమూర్తికే విచారణ వివరాలు చెప్పకపోతే.. ఇంకెవరికి చెబుతారన్న డౌట్ రావడమే దీనికి కారణం. చివరికి న్యాయమూర్తి… సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై నాలుగు వారాలు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా అని హైకోర్టు ప్రశ్నించినప్పుడు సీఐడీ తరపు న్యాయవాది.. దర్యాప్తు కొనసాగిస్తే సాక్ష్యాలు వస్తాయని వాదించారు. ఫిర్యాదు, స్టేట్మెంట్లు ఉన్నాయి.. ఇంకా ఆధారాలేం కావాలి అని ఎదురు ప్రశ్నించారు. రైతులు నష్టపోలేదు.. ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్డీఏలోని సెక్షన్ 146 ప్రకారం.. అధికారులను ఎలా విచారణ జరుపుతారని హైకోర్టు సీఐడీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వీటన్నింటికీ సీఆర్డీఏ తరపు న్యాయవాది.. స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో నాలుగు వారాల స్టే ఇస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అసలు బాధితులు లేరు.. ప్రాథమిక ఆధారాలు లేవు.. ఏమీ లేకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంగా కేసు పెట్టారని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనం ముందు వాదించారు. నారాయణ తరపు న్యాయవాది కూడా అదే చెప్పారు. అసలు నేరం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం .. రాజకీయంగా అవినీతిపై ప్రశ్నించకుండా ఉండటానికేనని.. వాదించారు. ఇలాంటి సమయంలో ఆధారాలు చూపించాల్సిన ప్రభుత్వం తరపు న్యాయవాది… కోర్టుకు వివరాలు చెప్పలేమని చెప్పుకొచ్చారు.
ఓ వైపు విచారణ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లిలో సీఐడీ అధికారులు విచారణ పేరుతో హడావుడి చేశారు. రాజధానికి భూములిచ్చిన రాజధాని రైతుల్ని.. మాజీ సీఆర్డీఏ అధికారుల్ని పిలిచి ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు మీడియాకు … లీకులు ఇచ్చి కావాల్సినంత హంగామా సృష్టించారు. వారిని పిలిచి కీలక సమాచారం తీసుకుంటున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. అయితే ఆ రైతులు… తాము ఇష్ట పూర్వకంగానే భూములిచ్చామని … ఎవరూ బెదిరించలేదని ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేసిన చెరుకూరి శ్రీధర్‌ను ప్రశ్నించారు. మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించినట్లు ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు సమాచారం లీక్ చేశారు.