సినీ నటి జత్వానీ వ్యవహారంలో ఓ మాఫియా ముఠాగా ఏర్పడి చేయకూడని పనులు చేసిన పోలీసు అధికారులందరికీ ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కింది స్థాయి నుంచి కాంతి రాణా టాటా వరకూ అందరికీ ముందస్తు బెయిల్ లభించింది. ఈ పోలీసు అధికారులు చాలా మందిని అక్రమంగా జైలుకు పంపారు. కానీ తాము మాత్రం జైలుకు వెళ్లుకండా రక్షణ పొందారు. నిజంగా వీరిని అరెస్టు చేయాలనుకుంటే జత్వానీ ఫిర్యాదు ఇచ్చిన రోజులే లోపలేసి ఉండేవాళ్లు. కానీ చేయలేదు. విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. ఆయనకూ బెయిల్ వచ్చింది. కానీ ఈ పోలీసుల్ని మాత్రం అరెస్టు చేయలేదు.
పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయని ఏ 2 .. డీజీ స్థాయి అధికారి అయిన సీతారామాంజనేయులును అరెస్టు ఎందుకు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. అది దర్యాప్తు అధికారి నిర్ణయమని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మొత్తం ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసింది ఆయన అయినప్పుడు ఆయనను అరెస్టు చేయకపోతే.. దిగువ వారి విషయంలో హైకోర్టు ఉదారంగా స్పందించే అవకాశం ఉంది. అయినా సీతారామంజనేయల్ని అరెస్టు చేయలేదు. దీంతో వారికి ముందస్తు బెయిల్ మంజూరు అయింది.
పోలీసులు అరెస్టు చేయలేదా.. ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లుగా ఉన్నారా అన్నది తెలియదు. అయితే సీతారామాంజనేయులు.. చంద్రబాబును రాళ్లతో కొట్టే ఎన్నో కుట్రల్ని చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అంటే ఆయనపై హత్యాయత్నాలు చేయించారన్నమాట. ఇంకా చంద్రబాబు కుటుంబసభ్యులందర్నీ తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ఎన్నో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా వారిపై ఈగ వాలడం లేదు. కేవలం పోస్టింగ్ మాత్రమే లేదు.