మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం.. ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేయడంపై చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న సంస్థల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది.
మొత్తం ఈవో తానే సర్వాధికారినన్నట్లుగా వ్యవహరించడం … జీతాలు నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడటంతో.. అసలు ఈవో పాత్ర ఏమిటి? ఏం చేస్తారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్లో ఈవో తన ఆదేశాలను పాటించడం లేదని పేర్కొనడంతో.. ఈవో ఆదేశాలను పాటించాల్సిందేనని రూలింగ్ ఇచ్చారు. ఆడిటింగ్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని.. ఎవరెవరో వస్తున్నారని అశోక్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయి అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ్లాగే స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రాత్రికి రాత్రి ఆయనను పదవి నుంచి తొలగించి.. సంచైతను కూర్చోబెట్టారు. కోర్టు ఆమె నియామకాన్ని కొట్టేసిన తర్వాత కూడా.. అశోక్ గజపతిరాజు కు అడ్డంకులు సృష్టిస్తున్నారు. విచారణలు.. కేసులు.. అంటూ.. ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆడిటింగ్ పేరుతో అసలు జీతాలు ఇవ్వడమే మానేశారు. దాంతో ఉద్యోగులు ఆందోళన చేశారు. ఉద్యోగుల్ని రెచ్చగొట్టారంటూ అశోక్ పై కేసు కూడా పెట్టారు. అయినా అశోక్ గజపతిరాజు మాత్రం.. తన పోరాటం తాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోర్టును ఆశ్రయిస్తున్నారు.