గ్రామసర్పంచ్లు, సెక్రటరీలఅధికారులను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యాంగబద్ధంగా సర్పంచ్లకు సెక్రటరీలకు ఉన్న అధికారాలను వీఆర్వోలకు అప్పగించడం ఏమిటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. తమ అధికారాలను లాగేసుకున్నారని గుంటూరు జిల్లా తోకలవారి పాలం సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పాలనా సంస్కరణలు అంటూ పెద్ద ఎత్తున మార్పులు చేసింది. గ్రామాల్లో పంచాయతీలు ఉన్నప్పటికీ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది.
గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్ల వ్యవస్థ పని చేస్తున్నప్పటికీ.. సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీరి అధికారాలను.. వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జీవో 2ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సర్పంచ్ కంటే వీఆర్వోకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇది రాజ్యాంగంలోని 73వ సవరణకు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ఉందన్న విశ్లేషణలు మొదటి నుంచి న్యాయవర్గాల్లో వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చామని … సర్పంచ్, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించినా ప్రయోజనం లేకపోయింది.
వీఆర్వోలకు అధికారాలు అప్పగించడం.. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల అధికారాలు లాగేసుకోవడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్ కూడా అదే విధంగా అధిపతని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు నిర్ణయం .. గ్రామ సచివాలయాల వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్లీ పంచాయతీకేఅన్ని అధికారాలు దఖలు పడతాయి. దాని వల్ల గ్రామసచివాలయాల వ్యవస్థ బలహీనపడుతుందని చెబుతున్నారు.