రవిప్రకాష్‌పై టీవీ9 కొత్త యాజమాన్యం నమోదు చేసిన బోనస్ కేసు విషయంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. అభియోగాలపై నవంబర్ రెండో తేదీన వరకూ స్టే విధించింది. అప్పటి వరకూ కేసును వాయిదా వేసింది. సీఈవోగా ఉన్న సమయంలో.. రవిప్రకాష్ రూ. 18 కోట్లు సంస్థ నిధులను అక్రమంగా తరలించారని అలంద మీడియా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన.. గంటల్లోనే రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరో వైపు క్వాష్ పిటిషన్‌ను రవిప్రకాష్ హైకోర్టులో దాఖలు చేశారు.
అలంద మీడియా దాఖలు చేసిన కేసు విషయంలో… ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు స్టే విధించడంతో… రవిప్రకాష్‌కు బెయిల్ వచ్చే మార్గం సుగమం అయిందని ఆయన న్యాయవాదులు భావించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్లో… అలంద మీడియా తరపు న్యాయవాదులు.. కోర్టు తీర్పు అందలేదనే వాదన వినిపించారు. బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. మరో వైపు.. సెషన్స్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. హైకోర్టు ఉత్తర్వులను.. రవిప్రకాష్ న్యాయవాదులు ప్రస్తావించి.. ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయితే.. ఇక్కడ కూడా.. హైకోర్టు ఉత్తర్వాలు ఇంకా అందలేదనే వాదననే… అలంద తరపు న్యాయవాదులు జడ్జికి వినిపించారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను.. అందుకున్న తర్వాత వాటిని రవిప్రకాష్ లాయర్లు కోర్టులో ప్రొడ్యూస్ చేసి.. బెయిల్ కోరే అవకాశం ఉంది. అయితే.. రవిప్రకాష్‌ను ఎలాగైనా కస్టడీకి తీసుకోవాలన్న ఉద్దేశంలో… పోలీసులు ఉన్నారు. వారికి హైకోర్టు నిర్ణయం ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు నవంబర్ రెండో తేదీ వరకూ స్టే ఇచ్చినందున… రవిప్రకాష్ బెయిల్ పై… ఉత్కంఠ ఏర్పడింది. అయితే.. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం ఉండదని.. రవిప్రకాష్ న్యాయవాదులు చెబుతున్నారు.