వైకాపా, తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుండి అధికార తెరాసలోకి మారిన ఎమ్మెల్యేలు నేటికీ వారి మాతృపార్టీల ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. వారి రాజినామాలకై ఆ పార్టీలు చేసిన ఒత్తిడి, న్యాయపోరాటాలు ఫలించడం లేదు. వారు వేసిన పిటిషన్లపై ఈరోజు తీర్పు చెప్పిన హైకోర్టు స్పీకర్ పరిధిలో ఉన్న వారి వ్యవహారంలో కలుగజేసుకోలేనని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ విషయంలో స్పీకర్ తక్షణమే తగిన చర్యలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సదరు ఎమ్మెల్యేలందరికీ ఊరట లభించినట్లే భావించవచ్చును. కానీ తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ, “ఈ తీర్పును ఊరటగా భావించలేము. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలసిందిగా హైకోర్టు స్పీకర్ ని కోరింది. ఒకవేళ స్పీకర్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేము సుప్రీంకోర్టుకి వెళ్లి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతాము,” అని అన్నారు.
మూడు నాలుగు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ కార్యాలయం నుండి తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకి సరిగ్గా ఇటువంటి సూచనే చేస్తూ ఒక లేఖ అందింది. ఇప్పుడు హైకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తెలంగాణా ప్రభుత్వం వారి అభిప్రాయాలను మన్నించే ఆలోచనలో ఉన్నట్లు ఎటువంటి సంకేతం ఇవ్వలేదు. ఒకవేళ అటువంటి ఆలోచనే ఉండి ఉంటే కధ ఇంతవరకు రానిచ్చేదే కాదు.