గురరజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకి అక్రమ సన్నపురాయి తవ్వకాల వివాదంలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి దీనిపై మరో పిల్ వేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని .. ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.
టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు… అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారి దగ్గర్నుంచి నష్టపరిహారం రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖజానాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు… కాగ్‌తో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అంతే కాదు.. ఈ కేసులో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ.. కాగ్, సీబీఐ డైరక్టర్, కేంద్రగనుల శాఖలను .. ఈ కేసులో సుమోటోగా హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. ఆగస్టు 21న తదుపరి విచారణ జరిగేలోపు.. అక్రమ మైనింగ్ దారుల నుంచి జరిగిన నష్టాన్ని రాబట్టే విషయంలో ఎలాంటి పురోగతి చూపించారో.. నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మానసనం అధికారులను ఆదేశించింది.
గురజాల అక్రమల తవ్వకాల వ్యవహారంలో హైకోర్టులో దాఖలైన పిల్‌ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చాలా తేలికగా తీసుకున్నారు. తవ్వకాలకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. కానీ వారు కూలీలే. అసలు వ్యక్తుల్ని వదిలేసి కూలీలపై కేసులు పెట్టడమేమిటని హైకోర్టు మండిపడింది. ఈ కేసులో టీజీవీ కృష్ణారెడ్డి .. ఎమ్మెల్యే యతరపతినేని, ఆయన అనుచరుల హస్తం ఉందని… పిల్ దాఖలు చేయడంతో.. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. యరపతినేని వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.