రఘురామకృష్ణరాజు అరెస్ట్… అనంతరం జైలుకు తరలించే వ్యవహారంలో అటు సీఐడీ కోర్టు… ఇటు హైకోర్టు ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. ప్రభుత్వం, సీఐడీతో పాటు సంబంధం ఉన్న ఇతర అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ప్రభుత్వంపై సుమోటోగా… కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలనిహైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ కోర్టు ఆయనకు.. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రమేష్ ఆస్పత్రిలోనూ వైద్య పరీక్షలు చేయించాలని.. రమేష్ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఐడీ అధికారులు.. అటు సీఐడీ కోర్టు ఆదేశాలు కానీ.. ఇటు ఏపీ హైకోర్టు ఆదేశాలు కానీ అమలు చేయలేదు.
ఉదయం పది గంటల కల్లా మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా.. తీరుబడిగా సాయంత్రం పూట.. రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించినా సీఐడీ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి.. ఆర్మీ ఆస్పత్రికి తరలించాలన్న ఆదేశాలిచ్చిన తర్వాత జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు కానీ రమేష్ ఆస్పత్రికి మాత్రం తరలించలేదు. అసలు కోర్టు అనుమతి లేకుండా జైలుకు తరలించడం అనేది పూర్తిగా హక్కుల ఉల్లంఘన.. కోర్టు ధిక్కరణ అని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
రఘురామ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ.. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి… హైకోర్టు ధర్మాసనానికే ఉద్దేశాలు అంటగట్టేలా వాదనలు వినిపించారు. ఈ కేసుపై మీకు ప్రత్యేక ఆసక్తి ఎందుకని ధర్మాసనంపై అనుమానాలు కలిగేలా ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం మండిపడింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను కూడా రికార్డు చేయాలని ఆదేశించింది. మానవ హక్కులకు భంగం గలిగినప్పుడు కోర్టులు అలాగే స్పందిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ కింద.. ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌తో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా నోటీసులు అందుకోనున్నారు.
రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. సీల్డ్ కవర్లో రిపోర్ట్ సుప్రీంకోర్టుకు పంపారు. ఈ నేపధ్యంలో హైకోర్టు .. ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది.