పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
పార్టీ మారిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత నాలుగు వారాల లోపు ఎప్పటి లోపు విచారణ చేస్తారు, ఎప్పటి లోపు నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఆదేశించింది. అప్పటికీ ప్రకటన రాకపోతే తామే సుమోటోగా విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
విచారణ సందర్బంగా… స్పీకర్ ముందు ఉన్న అంశాన్ని కోర్టులు డిసైడ్ చేయలేవని, కోర్టు విచక్షణ అధికారం ఉంటుందని లాయర్ వాదించారు.
అయితే, తాజా తీర్పును స్పీకర్ కార్యాలయం సవాల్ చేస్తుందా…? అమలు చేస్తుందా…? అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తాజా తీర్పుపై అప్పీల్ కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఇక, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలపైనే. కానీ ఆ తర్వాత మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో… వారందరికీ ఈ తీర్పు వర్తిస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, మొత్తం వ్యవహరంలో దానం నాగేందర్ ఇష్యూనే కీలకంగా మారింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ మారి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసినందున… ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.