రాయలసీమకి నీళ్ళు అందించేందుకు ప్రారంభించిన గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా వరద కాలువల నిర్మాణం కోసం కర్నూలు జిల్లాలో చేర్వుపల్లి గ్రామంలో ప్రభుత్వం పనులు మొదలుపెట్టాలనుకొంది. ఆ కాలువ నిర్మించబోయే 8.92 ఎకరాలు ప్రభుత్వ భూమి కావడంతో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. కానీ అది ప్రభుత్వ భూమి కాదంటూ వైకాపా నేతలు హైకోర్టులో వేసిన ఒక పిటిషన్ కారణంగా ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి.
ప్రస్తుతం ప్రజా పద్దుల సంఘానికి చైర్మన్ గా ఉన్న వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్. దస్తగిరి రెడ్డి వేసిన పిటిషన్ని విచారణకి స్వీకరించిన హైకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి పనులు చేపట్టవద్దని గత ఏడాది ఆగస్ట్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఆ కేసుపై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న తరువాత, అవి ప్రభుత్వ భూములేనని నిర్ధారించి కేసుని కొట్టి వేసింది. ఇదివరకు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులని కూడా ఉపసంహరించుకొని పనులు మొదలుపెట్టడానికి అనుమతించింది.
ఇటువంటి ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమిని సేకరించవలసి వస్తే అందుకు తగిన నష్టపరిహారం చెల్లించి తీసుకొనే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ భూమిలో పనులు మొదలుపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు రాజకీయ దురుదేశ్యంతో అడ్డుపడి ఈవిధంగా న్యాయపరమైన చిక్కులు సృష్టించిపెట్టడం చాలా దురదృష్టకరం. “ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది..దాని వలన లక్షల కోట్లు ప్రజాధనం తెదేపా నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందని” నిత్యం ఆవేదన వ్యక్తం చేసే వైకాపా, ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న పనులని ఎందుకు అడ్డుకొంది? పనులు నిలిచిపోయినందున ఆ నీటి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సీమ రైతులు, సామాన్య ప్రజలు ఈ ఏడాది కాలంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో వైకాపా గ్రహించిందా? నిర్మాణపనులు ఏడాదిపాటు ఆలశ్యం అయితే నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోతుంది. దానిని ఎవరు భరిస్తారు? ప్రభుత్వమా లేక ఈ జాప్యానికి కారణమైన వైకాపా?
రాయలసీమకే చెందిన విద్యాధికుడైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా ఇటువంటి పనులలో ప్రభుత్వానికి సహకరించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. ఒకవేళ అవి నిజంగానే ప్రైవేట్ భూములైతే సదరు భూయజమానులకి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పించే ప్రయత్నం చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఈవిధంగా అభివృద్ధి పనులకి అవరోధాలు సృష్టించడం సరికాదు. ఏడాది పాటు కోర్టు కేసు సాగిన తరువాత అవి ప్రభుత్వ భూములేనని హైకోర్టు స్పష్టం చేయడంతో వైకాపా నేతలిద్దరూ ఉద్దేశ్యపూర్వకంగానే దీనిపై వివాదం సృష్టించారని భావించవలసి వస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులని వైకాపా అడ్డుకొంటోందని మంత్రులు, తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలకి ఇది బలం చేకూర్చుతున్నట్లుంది.