తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విలువైన స్థలాన్ని టీఆర్ఎస్ ఆఫీస్ కోసం అక్రమంగా కేటాయించారని రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హైకోర్టు.. సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అత్యున్నత నాయ్యస్థానం ఆదేశించింది.
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మే 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్‌లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్ఏ ఆమోదముద్ర వేసింది.
ఈ కేటాయింపు అక్రమం అని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ భవన్ పేరుతో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఆ సమీపంలోనే రంగారెడ్డి జిల్లా కార్యాలయం కోసం అంటూ ఈ స్థలం కేటాయించడంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజా ఆస్తులను అప్పనంగా కొట్టేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పంచారు. ప్రతీ జిల్లాలోనూ టీఆర్ఎస్ కార్యాలయాల కోసం స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం తెలంగాణ భవన్ రాష్ట్ర కార్యాలయం అని .. జిల్లా కార్యాలయం కోసం స్థలం కేటాయించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఈ వివాదం కోర్టుకు చేరింది.