అధికారం పోయే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి, సాక్షికి కొత్త కొత్త సమస్యలు ఎదురొస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ.వందల కోట్ల విలువైన ప్రకటనలు ఏపీ ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి, జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో సుప్రీం నిబంధనలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వ్యక్తులను గొప్పగా చిత్రీకరిస్తూ ప్రకటనలు ఇవ్వకూడదని.. అలాగే గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కూడా ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదని సుప్రీం కోర్టు 2015లో రూలింగ్ ఇచ్చింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను వైసీపీ పట్టించుకోలేదు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై ఏపీ హైకోర్టులో చెన్నుపాటి సింగయ్య పిటిషన్ దాఖలు చేశారు. ప్రకటనలకు ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసిందన్న పిటిషనర్ .. మొత్తం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 2019 జూన్ నుంచి ప్రభుత్వం జారీచేసిన ప్రకటనలు వైసీపీకి లబ్ధి చేకూర్చేలా ఆ పార్టీ జెండా రంగులను తలపించేలా ఉన్నాయని పిటిషనర్ ఆధారాలు సమర్పించారు. వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రకటనలు ఇచ్చారని.. ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ఉద్దేశాలు ఉండరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తెలిపారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకటనలు ఉన్నాయని.. ప్రకటనలకు చేసిన ఖర్చును వైసీపీ నుంచి రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు నిబంధనల మేరకే ప్రకటనలు ఉండాలని హైకోర్టు ఆదేశించింది.