పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వెళ్తున్న వారి వద్ద ఒక్క మద్యం బాటిల్ ఉన్నా.. పోలీసులు వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు పెడుతున్నారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిహిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవో నెంబర్ 411 ప్రకారం మూడు బాటిళ్ల మద్యాన్ని తెచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని పిటిషనర్లు కోర్టులో వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు ఈ విషయాన్ని కాదలేకపోయారు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే.. ఎవరైనా నా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అంతర్రాష్ట్ర మద్యం రవాణాపై చాలా కాలంగా ఆంక్షలు ఉన్నాయి. అయితే వ్యక్తిగత వినియోగానికి సంబంధించి మూడు బాటిళ్ల వరకు మద్యం తెచ్చుకోవడానికి కూడా ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. కొత్త మద్యం విధానం ప్రకటించినప్పుడు జారీ చేసిన జీవోలోనే ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే.. పోలీసులు మాత్రం.. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరిహద్దుల్లో కార్లలోబైకుల్లో… ఒక్క మద్యం బాటిల్ ఉన్నా కేసులు పెడుతున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని తిరిగి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు.
పోలీసులు ఇలా చేస్తున్నారని … చట్టాలను పట్టించుకోవడం లేదంటూ.. గతంలో ఓ సారి… డీజీపీ సవాంగ్‌ను కూడా హైకోర్టు పిలిపించి వివరణ అడిగింది. ఆ తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో క్లారిటీ లేదు. చివరికి జీవో ప్రకారం… వారికి మూడు బాటిళ్లు తీసుకునే అవకాశం ఉందని కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన రూలింగ్ ఇవ్వడంతో.. మూడుబాటిళ్లలోపు… మద్యం తీసుకెళ్తున్న వారిపై నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులు చిక్కులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడనుందని అంటున్నారు.