అధికారం చేపట్టినప్పటి నుండి ఇదిగో అదిగో అంటూ ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిన ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ .. గ్రామాల్లో జరిగేలా లేదు. వివిధ రకాలుగా ఎన్నికల కోడ్ అడ్డంకి వస్తూండటంతో ఏపీ ప్రభుత్వం అర్జంట్‌గా ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. పథకం అమలు కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా కొనసాగేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కొన్ని సూచనలు ఇచ్చింది. పార్టీల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని … రెండ్రోజుల్లో ప్రణాళిక తయారు చేసుకుని.. ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అలాగే.. ఎస్ఈసీ కూడా.. 5 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని హైకోర్టు స్ష్టం చేసింది.
సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని .. పేద ప్రజల కోసం పెట్టిన పథకం కాబట్టి.. ఎస్ఈసీ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. నిజానికి ఎస్ఈసీ ఎన్నికల కోడ్ పట్టణాల్లో ఉండదని చెప్పారు. పల్లెల్లో కూడా… పార్టీ రంగులు ఉన్న వాహనాల్లో బియ్యం పంపిణీ వద్దని చెప్పారు. దీంతో కొన్ని కోట్ల వాహనాలకు స్టిక్కర్లు వేశారు. కానీ వాహనాన్నీ వైసీపీ రంగులతో నిండిపోవడంతో ఇప్పుడు వాటిని తీసుకుని రేషన్ బియ్యం పంపిణీ చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.
ఎస్ఈసీ కూడా అదే విషయాన్ని చెప్పింది. కానీ ప్రభుత్వం అసలు పథకాన్ని ఆపేయాలని ఎస్ఈసీ ఆదేశించినట్లుగా భావించింది. ఆ పద్దతిలోనే కోర్టుకెళ్లింది. కానీ హైకోర్టు కూడా రంగులను తీసేయాలని స్పష్టం చేసింది. రేపటి నుంచే కార్డు దారులకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికే అనేక బాలారిష్టాలను ఈ పథకం ఎదుర్కొంటోంది. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని అటు డీలర్లు ఇవ్వక.. ఇటు డోర్ డెలివరీ చేయక ఇబ్బంది పెడితే పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.