విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన కోడి కత్తి దాడి ఘటనకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న జగన్ పిటిషన్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు జగన్ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాడి జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు..? విశాఖ నుంచి వెంటనే విమానంలో హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఏపీ పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు గాయంతో విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అన్న దానిపై వివరాలు తెలుసుకుని తమకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను సీల్డ్ కవరులో ఉంచి సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే జగన్ వాంగ్మూలం ఇవ్వలేదని వీటికి జనగ్ న్యాయవాది తెలిపారు. జగన్‌పై దాడి కేసును రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు. పిటిషన్ విచారణార్హతపై మంగళవాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా.. పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారి విచారణకు సహకరిస్తూ… ఆ విచారణ తీరుపై అభ్యంతరాలు ఉంటే వాటిని ఎత్తి చూపుతూ.. ఎవరైనా ధర్డ్ పార్టీ విచారణ కోసం కోర్టులో పిటిషన్ వేస్తారు. కానీ జగన్ ఘటనలో అసలు… పోలీసుల విచారణకు సహకరించకుండానే బాధితులు.. ఘటన జరిగిన గంటల్లో… స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
మరో వైపు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి కారణగా అయిన గాయం ఇంకా తగ్గని కారణంగా… జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు. గాయం నుంచి కోలుకోలేదని… జగన్ తరపు లాయర్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. జగన్ పై దాడి చేసిన నిందితుడు జానపల్లి శ్రీనివాసరావును పోలీసులు విశాఖ కోర్టులో హాజరు పరిచారు. పోలీసులు ఆయనకు మళ్లీ రిమాండ్ విధించారు.