ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై… హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేయడంతో పాటు.. హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై .. విచారణ జరిపి… అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రభుత్వాలను ఆదేశించింది. వివరణాత్మక ఆదేశాలను వెబ్సైట్లో అప్ లోడ్ చేయడంతో వెలుగులోకి వచ్చాయి. అసలు ఎల్జీ పాలిమర్స్ లాక్డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్ స్వాధీన పరచాలని హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసరాలను సీజ్ చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ అనుమతించవద్దని.. విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రం.. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని రూలింగ్‌లో ధర్మానసం స్పష్టం చేసింది. ఆ కమిటీలు ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు.. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరీన్ గ్యాస్ తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యాసంస్థలు, హాస్పిటల్స్, జనావాసాలు ఉన్నచోట… అంత ప్రమాదకరమైన గ్యాస్‌ను ఎలా స్టోర్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
విషవాయువు లీకేజీ ఘటన తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్చగా వదిలేయడం.. స్టైరీన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై అనేక అనుమానాలు.. ప్రశ్నలు విభిన్న వర్గాల నుంచి వస్తున్నాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే విచారణ జరిగే వరకూ..అక్కడ వస్తువుల్ని కదిలించకూడదు. అలా కదిలించడం.. సాక్ష్యాల్ని తుడిచేయడమే అవుతుంది. కానీ రెండు, మూడు రోజుల్లోనే లీక్ కాకుండా.. ఇతర ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ ను తరలించేశారు. దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో క్లారిటీ లేదు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంది.
ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం కారణంగా భారీ ప్రమాదం జరిగితే..ప్రభుత్వం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును నష్ట పరిహారంగా చెల్లించింది. ఆ కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఇంత వరకూ ఎవరికీ తెలియదు. చిన్న చిన్న కేసులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై… ఎవరైనా ఆందోళనలు నిర్వహిస్తే.. వారిపై కేసులతో ప్రభుత్వం దాడి చేస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా… కేసుుల పెట్టిస్తోంది. వీలైనంత వరకూ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎవరూ నోరెత్తకుండా చేయాలనే పట్టుదలను ప్రభుత్వం ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఇంత ఆసక్తి ఎందుకన్న చర్చ ప్రజల్లో పెరగడానికి ఇదో కారణం. ప్రస్తుతం హైకోర్టు కూడా…. ప్రజల్లో ఉన్న ఎన్నో అనుమానాలకు సమాధానాలను కోరినట్లయింది.