తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడానికి ఏపీ సర్కార్ ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం .. సిట్ విచారణపై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలను సమీక్షించేందుకు.. కొత్తగా ఏర్పడిన వైసీపీ సర్కార్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు కోసం పది మంది పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తవర్వులు ఇచ్చింది. ఈ బృందానికి పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ విచారణపై స్టే విధించింది.
ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను.. అనంతరం వచ్చే ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట వాదించారు. అసలు సిట్‌కు పోలీస్ స్టేషన్ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశాక దర్యాప్తు చేస్తారని.. కానీ ఏపీ సర్కార్ మాత్రం… ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టేందుకు సిట్ ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాల్లేని ఆరోపణలతో గత ప్రభుత్వంలోని కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేశారని వాదించారు.
అయితే గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకే సిట్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఈ కేసులోఓ ట్విస్ట్ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ సిట్ వేయమని సీఎంను ఆదేశించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్యాప్తునకు సిట్ ఏర్పాటైందని గతంలో ప్రకటించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధించింది.