కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ లో కొత్త భవనానికి సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయం భవనాన్ని కూల్చడం వల్ల కోట్ల ప్రజాధనం వృథా చేయడం తప్పితే, సామాన్య ప్రజలకు దీని వల్ల ఒరిగేదేం లేదనే వాదనతో రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీపై జీవన్ రెడ్డి వేరేగా మరో పిటీషన్ వేశారు. దీనిపై ఇవాళ్ల హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త భవనాలను నిర్మించొద్దంటూ వేరువేరుగా ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. పిటీషనర్ల తరఫు వాదన ఏంటంటే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది శాసన సభ్యులు అసెంబ్లీని వినియోగించుకునేవారనీ, ఇప్పుడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమేననీ, ఆ లెక్కన ఉన్న భవనం మరింత సువిశాలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఉన్న భవనాన్ని కాదనుకుని, ఎర్రమంజిల్ లో కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమౌతోందంటే కేవలం తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నమిది అని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఎర్రమంజిల్లో కొత్త భవనం కడితే, అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతాయని అభిప్రాయపడ్డారు. ఉన్న సెక్రటేరియట్ భవనం అధునాతంగా ఉందంటూ.. దానికి సంబంధించిన వాదనలు కూడా కోర్టులో జరిగాయి. హెరిటేజ్ భవనం కూల్చేయడంపై హైకోర్టు స్పందిస్తూ… దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమకు అందిస్తేనే దీనిపై విచారణను ముందుకు తీసుకెళ్లగలం అంటూ చెప్పింది. సచివాలయం, అసెంబ్లీ ప్లాన్లను తమకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
సచివాలయం, సెక్రటేరియట్ నిర్మాణ వ్యవహారాలు కోర్టుకు చేరుకోవడంతో కొంత ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారంతో న్యాయస్థానం సంతృప్తి చెందితేనే కేసీఆర్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై పురోగతి ఉంటుంది. దీంతో కోర్టు అడిగిన సమాచారాన్ని పకడ్బంధీగా ఇవ్వాల్సి ఉంటుంది. హెరిటేజ్ భవనం కూల్చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న కారణాలు, ఎర్రమంజిల్ లో నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకోబోయే జాగ్రత్తలపై కూడా కీలకంగా మారబోతున్నాయి.