గవర్నర్ పై దాడి చేశారనే కారణ చూపిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లపై … అనర్హతా వేటు వేయించారు. రాత్రికి రాత్రే… అసెంబ్లీ సీట్లను ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించి.. ఈసీకి సమాచారం అందించారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోనివ్వలేదు. తాము కోర్టుకెళతామని ఎమ్మెల్యేలు చెప్పినా.. ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే.. అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయానికి… అడ్డంపడే అధికారం న్యాయవ్యవస్థకు లేదు.
కానీ హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సమయంలోనే అడ్వకేట్ జనరల్..ఇది అసెంబ్లీ వ్యవహారం… స్పీకర్ కు విచక్షాధికారం ఉందని వాదిస్తే… సరిపోయేది. కానీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి … గవర్నర్ ప్రసంగం సమయంలో.. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో వ్యవహారం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోయినట్లయింది. వీడియోలు ఇవ్వకపోవడం… ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకపోవడాన్ని కారణంగా చూపి… ఎమ్మెల్యేల అనర్హతా వేటును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
నిజానికి ఈ తీర్పును కేసీఆర్ ఏ మాత్రం అంగీకరించరని అంతా అనుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పేందుకు… ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి..కోర్టు తీర్పును తిరస్కరిస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అత్యవసర రివ్యూ పిటిషన్ వేయించారు. సింగిల్ జడ్జి తీర్పును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఈ పిటిషన్ తో టీఆర్ఎస్ తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్లయింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందో లేదో హైకోర్టు ధర్మాసనం బుధవారం తేలుస్తుంది. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా.. ఈ కేసు మాత్రం.. ముందు ముందు చాలా రాష్ట్రాల్లో రిఫరెన్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది. మారుతున్న రాజకీయాల్లో అసెంబ్లీలో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో కోర్టులు జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తే… అటు న్యాయవ్యవస్థ, ఇటు శానసవ్యవస్థల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఒకరి అధికారాల్లో ఒకరు జోక్యం చేసుకోవడం మితిమీరిపోతుంది. అదే జరిగితే ఇబ్బందికరమే. ప్రస్తుతం తెలంగాణలో కేసు ఇతర రాష్ట్రాల హైకోర్టులకు కూడా మార్గదర్శకంగా మారితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. కొన్నాళ్ల క్రితం ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేరోజాపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. హైకోర్టులో రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఏపీ అసెంబ్లీ పాటించలేదు. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్తే.. స్పీకర్ దే అంతిమ నిర్ణయం అని తీర్పు వచ్చింది. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఈ విస్తృతాధికారాన్ని.. ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి తలెత్తింది.