డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి.. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తన కుమారుడ్ని అరెస్ట్ చేయలేదని.. పోలీసులు చెబుతున్నారని అలాంటప్పుడు.. ఆస్పత్రిలో ఉంచాల్సిన అవసరం ఏమిటని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియచేసి.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డిశ్చార్జ్ కావొచ్చని సూచించింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో.. సుధాకర్ ఇంటికి వెళ్లడానికి మార్గం సుగమం అయింది.
విశాఖలో మద్యం తాగి న్యూసెస్స్ చేస్తున్నారన్న కేసులో డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు రెండు వారాల కిందట అదుపులోకి తీసుకున్నారు. చొక్కా చినిగిపోయిన స్థితిలో.. చేతులు వెనక్కి కట్టేసి ఆయనను అరెస్ట్ చేసిన విధానం సంచలనం సృష్టించింది. మొదట ఆయనను…. కేజీహెచ్‌కు.. ఆ తర్వాత మానసిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అయితే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. కోర్టు కూడా.. ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారా..? జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారా.. అని ప్రభుత్వ న్యాయవాదిని అడిగితే.. సమాదానం చెప్పలేకపోయారు. అరెస్ట్ చేశామని చెబితే.. కోర్టులో హాజరు చూపించాల్సి ఉంటుంది. అరెస్ట్ చేయలేదని చెబితే.. నిబంధనలు పాటించలేదని స్పష్టమవుతుంది. దీంతో పోలీసులు ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిపడ్డారు.
ఈ సమయంలో.. సీబీఐ ఆ కేసును టేకప్ చేసింది. సుధాకర్‌పై పోలీసులు నమోదు చేసిన కేసును కూడా.. రీ రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు.. కేసు మొత్తం సీబీఐ వద్ద ఉంది. సీబీఐ ఆయనను అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసే ఉద్దేశం కూడా సీబీఐకి లేదని తెలుస్తోంది. దీంతో.. హైకోర్టు అన్ని పరిశీలించి.. ఆయన ఇంటికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది. పోలీస్ కస్టడీలో కానీ.. జ్యూడిషియల్ కస్టడీలో కానీ లేకుండా.. డాక్టర్ సుధాకర్ ను నిర్బంధంగా మానసిక వైద్య శాలలో ఎలా ఉంచారనేది.. ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్న. కుటుంబసభ్యుల్ని కలుసుకోనియకుండా.. పోలీసు కాపలా పెట్టారని… ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తానన్న వెళ్లనీయలేదని.. తనకు చికిత్స చేసిన డాక్టర్ రామిరెడ్డి వేధించారని .. సుధాకర్ పలుమార్లు ఆరోపించారు కూడా. ఈ వివరాలన్నీ సీబీఐ విచారణలోనే బయటకు రావాల్సి ఉంది.