ప్రభుత్వ జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచారని హైకోర్టు ఆదేశించింది. అయితే జీవోలను ఆఫ్‌లైన్‌లో మాత్రం ఉంచాలని… రిజిస్టర్లలో మాన్యువల్ పద్దతికి పోయిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కావు ఇవి.. తెలంగాణ సర్కార్ కు అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. వాసాలమర్రి గ్రామంలో ఇటీవల దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించి.. తర్వాతి రోజు నిధులు విడుదల చేశారు. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.
దీనిపై జరిగి న విచారణలో… పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలు ఖరారు చేశామని.. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ విషయం ఎందుకు పిటిషన్లో పేర్కొనలేదని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.కానీ నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని… జీవోలను కూడా వెబ్సైట్లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని .. వాటిని ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంచారని ఆదేశించింది.
తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణను నమోదు చేసుకుని పిటిషన్‌పై విచారణ ముగించింది. తెలంగాణ సర్కార్ మరో రోజులో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాల జీవోను వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఏపీ సర్కార్ ఆఫ్ లైన్ జీవోలపై ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే.. పరిస్థితేమిటన్న చర్చ సహజంగానే తెలంగాణ హైకోర్టు తీర్పుతో వస్తుంది.