వైఎస్ వివేకా హత్య కేసులో రికార్డులు మొత్తం సీబీఐకి అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి రికార్డులు ఇచ్చేందుకు పులివెందుల మెజిస్ట్రేట్ నిరాకరించారు. దాంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రికార్డులు స్వాధీనం చేయాలని తీర్పు చెప్పింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా బాబాయ్ అయిన వివేకానందరెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పులివెందులలోని ఇంట్లో హత్యకు గురయ్యారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే హత్య చేయించారని ఆరోపణలు గుప్పించారు.
అయితే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితుల్ని పట్టుకుని బాబాయ్ కుటుంబానికి న్యాయం చేయడం లో విఫలమయ్యారు. అంతకు ముందు సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న ఆయన తర్వాత పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అయితే వివేకా కుమార్తె మాత్రం.. తన సోదరుడు జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేదని.. సీబీఐ విచారణ కోసం కోర్టులో పిటిషన్ వేసి అనుకూల ఫలితం తెచ్చుకున్నారు. అయితే సీబీఐ బృందం విచారణ చేపట్టినప్పటికీ.. స్థానిక అధికారులు సహకరించలేదు. అక్కడ మెజిస్ట్రేట్ వద్ద ఉన్న రికార్డులు కూడా ఇవ్వలేదు. ఆ రికార్డుల కోసం సీబీఐ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ఇవ్వలేదు.
చివరికి సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ లోపు.. ఓ బృందానికి కరోనా సోకింది. దీంతో మరో బృందాన్ని నియమించారు. ఆ బృందం.. కొత్తగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ బాబాయ్ హత్య కేసు నిందితుల్ని పట్టుకోవడంలో జగన్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదనేదానిపై అదే పనిగా రాజకీయ విమర్శలు వస్తున్నా…పట్టించుకోవడం లేదు. ఇదే అనేకానేక అనుమానాలకు దారి తీస్తోంది.