తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చేందుకు ఎదురు చూస్తూ… బోర్డర్ వద్ద పడిగాపులు పడుతున్న వారికి హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. బీజేపీ నేత వేసిన పిటిషన్ విచారణ జరిపి.. నిబంధనల మేరకు.. వారికి ఆరోగ్యపరీక్షలు జరిపి అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకుని వస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని… సమస్యలు ఉంటే క్వారంటైన్‌కు తరలించాలని.. లేకపోతే హోం క్వారంటైన్‌కు ఆదేశించాలని హైకోర్టు సూచించింది. ఇంట్లో ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం కూడా మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిపింది. రాష్ట్రంలోకి వచ్చే వారందర్నీ క్వారంటైన్లోకి తరలించాలని .. అలా ఒప్పుకుంటేనే రానివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా మంత్రి పేర్ని నాని చెప్పారు.
అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయి.. ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వారికి భోజనం, వసతి ఏర్పాట్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా చూడాలని.. మంత్రులను సీఎం ఆదేశించారు. ఒక వేళ అక్కడి ప్రభుత్వాలు తమ వల్ల కాదని చెప్పినా.. పట్టించుకోకపోయినా.., సొంత ఖర్చుతో ఆ ఏర్పాట్లు చేసి.. లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ… ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు జగన్మోహన్ రెడ్డి.
ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఎన్వోసీ ఉన్న వాళ్లు వస్తున్నారు.. క్వారంటైన్ కి వెళ్లే ఉద్దేశం ఉన్న వారినే ఏపీలోకి అనుమతిస్తున్నారు. మిగతా వారు ఎక్కువ మంది వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. ప్రభుత్వం.. ఇలా ఎన్వోసీలతో వచ్చే వారికి.. హోం క్వారంటైన్‌కు అంగీకరించే అవకాశం ఉంది. అయితే.. తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఎన్వోసీలు జారీ చేయడం ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరమైన సమస్యలు..మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారికే.. ఈ ఎన్వోసీలు ఇస్తున్నారు.