బీఆర్ఎస్ పార్టీ అనుమతి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించిందని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాలని స్పష్టం చేసింది.
నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎకరం స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. ఎన్నికలకు ముందే పార్టీ ఆఫీసును కేసీఆర్ తో ప్రారంభించాలని అనుకున్నా వీలు కాలేదు. నల్గొండ టౌన్ లోని కట్టిన ఈ భవనానికి మున్సిపాలిటీ అనుమతులు లేవు.
కొత్త ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ ఆఫీసును రెగ్యూలరైజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే, దీన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించటం, ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతంలో ఈ నిర్మాణం జరిగిందని మున్సిపల్ శాఖ వాదించగా… హైకోర్టు కూల్చివేయాలంటూ తీర్పునిచ్చింది.
15రోజుల్లో మున్సిపల్ శాఖ కూల్చివేతలు చేయాలని ఆదేశించగా… హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ అప్పీల్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
వరంగల్ జిల్లా పార్టీ ఆఫీసు విషయంలోనూ ఇలాంటి వివాదమే నెలకొంది. అది అక్రమ కట్టడం అని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. నల్గొండ పార్టీ ఆఫీసు తీర్పునే వరంగల్ పార్టీ ఆఫీసుకు వర్తింపచేయాలని వరంగల్ కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.