రుషికొండను బోడిగుండు చేసి .. ఐదు వందల కోట్లతో టూరిజం కాంప్లెక్స్ పేరుతో విలాసవంతమైన క్యాంప్ ఆఫీసును కట్టుకున్న జగన్ రెడ్డికి ఎదురు దెబ్బతగిలింది. అది అక్రమ నిర్మాణామేనని హైకోర్టు తాజాగా గుర్తించినట్లయింది. గతంలో హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలించి అనుమతికి మించి తవ్వకాలు జరిపి.. నిర్మాణాలు జరిపినట్లుగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో మూడు వారాల్లోగా చెప్పాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి నివేదిక ఇచ్చింది. తర్వాత కేసు విచారణకు రాలేదు.
అదే సమయంలో విశాఖకు మకాం మారుస్తున్నాననంటూ జగన్ రెడ్డి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జగన్ రెడ్డి ఉండటానికి రిషికొండపై కొత్తగా కట్టిన భవన బాగుంటుందని రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమయింది. అందుకే గతంలో పిటిషన్లు వేసిన వారు.. హైకోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. అక్కడ ప్రభుత్వం భవనాన్ని ప్రారంభిస్తోందని ..సీఎం అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టేందుకు సిద్ధమయ్యారని తమ పిటిషన్లపై విచారణ చేయాలని కోరారు. దీంతో హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టి తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. అక్రమ నిర్మాణాలైతే కూల్చి వేయాల్సి ఉంటుంది. ఎందకంటే పర్యావరణ నిబంధనలు..సీఆర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ వాటిని కట్టారు. రుషికొండపై టూరిజం భవనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ టూరిజం పేరుతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. రుషికొండపై పరిమితులకు మించి తవ్వారు.
అత్యంత ఘోరమైన పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి. దీనికి బాధ్యులైన అధికారులను జైలుకు పంపుతామని గతంలోనే హైకోర్టు హెచ్చరించింది. అందుకే ఈ అంశంపై ఉల్లంఘనలపై త్వరలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భవనంపై న్యాయవివాదాలు ఉన్నందున జగన్ రెడ్డి నైతికంగా కూడా ఆ భవనాల్లోకి వెళ్లడానికి అవకాశం ఉండదు. అక్రమ నిర్మాణంలోకి వెళ్తి ప్రజలకు సీఎం ఎలాంటి సందేశం ఇస్తారన్న విమర్శలు వస్తాయి.