ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘బీఫ్, పోర్క్ ఫెస్టివల్’ పేరిట మొదలయిన అనవసరమయిన వివాదాలలో చివరికి హైకోర్టు కూడా జోక్యం చేసుకోవలసివచ్చింది. ఉస్మానియా ప్రాంగణంలో ఎవరూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. తన ఆదేశాలను ఖచ్చితంగా అమలుచేయాలని పోలీసులను, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టి ఎవరయినా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లయితే వారి అడ్మిషన్లను రద్దు చేస్తామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ హెచ్చరించగా, అటువంటి విద్యార్ధులపై చట్టపరమయిన చర్యలు తీసుకొంటామని ఏ.సి.పి లక్ష్మినారాయణ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను అమలుచేసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బారీగా పోలీసులను కూడా మొహరించారు.
ఒకప్పుడు ఉస్మానియా విద్యార్ధులు తెలంగాణా సాధన కోసం పోరాడినప్పుడు అందరూ హర్షించారు. కానీ వారిప్పుడు ఇటువంటి అనవసరమయిన వివాదాలు సృష్టించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి గొడవల కారణంగా వారిపై విశ్వవిద్యాలయం కానీ పోలీసులు గానీ చర్యలు తీసుకొంటే చివరికి నష్టపోయేది విద్యార్ధులే. తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్ధులు చాలా మంది పోలీసు కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. కానీ తెలంగాణా ప్రభుత్వం వారిపై కేసులను ఉపసంహరించుకోవడంతో వారి భవిష్యత్ బుగ్గిపాలు కాకుండా తప్పించుకోగలిగారు.కానీ ఇటువంటి గొడవలలో అరెస్టయినా, విద్యాలయం నుంచి సస్పెండ్ చేయబడినా వారిని ఆదుకొనేందుకు, ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చును. పైగా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగవచ్చును. కనుక తమను వెనక నుండి ప్రోత్సహించే రాజకీయ నేతల, పార్టీలకు విద్యార్ధులు తలొగ్గకుండా కేవలం చదువులపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తే మంచిది.